తెలంగాణ

telangana

ETV Bharat / politics

సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదు : కేటీఆర్‌ - KTR ON ALLU ARJUN ISSUE

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన మాజీమంత్రి కేటీఆర్ - ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారని వ్యాఖ్య​ - అటెన్షన్, డైవర్షన్ కోసమే రేవంత్‌రెడ్డి పాకులాడారని ఆరోపణ

KTR ON CONGRESS GOVT
KTR Chit Chat about Congress Government (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 3:45 PM IST

Updated : Dec 30, 2024, 5:05 PM IST

KTR Chit Chat about Congress Government :అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన మాజీమంత్రి కేటీఆర్, ​ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారని ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పాకులాడారని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్​చాట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన ఆయన, సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు రేవంత్​రెడ్డి మాట్లాడట్లేదని ఆరోపించారు.

గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. రైతులు, చేనేతల మరణాలపైనా సీఎం రేవంత్​రెడ్డి స్పందించాలని ఉద్ఘాటించారు. అందరికీ కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తోందని, వాటిని కచ్చితంగా ఎదుర్కొంటామని అన్నారు. తన కేసుల్లో ఈడీ దూకుడుగా ఉందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. 420 గ్యారంటీలు అమలు చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. పీవీకి దిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. పీవీకి న్యాయం జరిగే వరకు కొట్లాడతామని ఉద్ఘాటించారు.

రక్షణ కవచంలా బీజేపీ ఎంపీల వైఖరి : రైతుభరోసా పేరుతో ప్రభుత్వం మోసం చేయబోతోందని మాజీమంత్రి కేటీఆర్​ ఆరోపించారు. ఈ ప్రభుత్వం తమకంటే ఎక్కువగా అప్పులు చేసిందని వ్యాఖ్యానించారు. ఓఆర్‌ఆర్‌ లీజు రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్ చేస్తోందని విమర్శించారు. జమిలి ఎన్నికలతో పెద్దగా నష్టం లేదని, ఇబ్బంది ఉండదని తెలిపారు.

సంక్రాంతికి ఇంకో మోసం : కాంగ్రెస్‌ క్యాడర్ కూడా ప్రశ్నిస్తోందని, ప్రజలు 6 గ్యారెంటీలు గురించి ప్రజలు అడుగుతున్నారని క్యాడరే మాట్లాడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రైతు భరోసా పేరుతో సంక్రాంతికి ఇంకో మోసం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పారు. వాళ్ల మనిషిని కోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు ఆపేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వానికి రక్షణకవచంలా బీజేపీ ఎంపీల వైఖరంటూ ధ్వజమెత్తారు. అమృత్ టెండర్లపై బీజేపీ ఎంపీలు, కేంద్రం నోరు విప్పట్లేదని నిలదీశారు.

బీఆర్​ఎస్​ను మరింత బలోపేతం చేస్తాం :2025 సంవత్సరంలో బీఆర్​ఎస్​ను మరింత బలోపేతం చేస్తామని, పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతామని, అదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని కేటీఆర్​ తెలిపారు. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని విభాగాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశంలో పార్టీ నిర్ణయం తీసుకొని చెప్తామన్నారు. ఆర్​ఆర్​ఆర్ రోడ్డు గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందని, అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్​లో ఆమోదం కూడా తెలిపిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు.

ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో లక్ష 39 వేల కోట్ల ఆప్పు ఎందుకు చేసిందని? ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ఈ అప్పులన్నీ దిల్లీకి పంపిస్తున్నారా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. అప్పుల కోసమే అప్పులు చేస్తున్నామని ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తన పైన ఇప్పటికే అనేక కేసులను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసింది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేశారన్నారు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో తమకు డబ్బులు ఎట్లా వచ్చాయో చెప్పాలని డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్ ధోకా నామ సంవత్సరంగా: అనుమానాలపైన కేసులు ఉండవని, కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయని కేటీఆర్​ పేర్కొన్నారు. అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఒకవైపు రైతు భరోసాను ఎగ్గొట్టడం, బీసీలను మోసపుచ్చడం అనే రెండు ప్రయత్నాలతో నూతన సంవత్సరాన్ని కాంగ్రెస్ ప్రారంభించబోతుందని అన్నారు. కాంగ్రెస్ ఈ సంవత్సరాన్ని ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు, గ్యారంటీలు ఆ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతు భరోసా ఎగకొట్టి రైతుల నోట్లో మట్టికొట్టిందని, 26 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఎగగొట్టడం వల్ల భాకీ పడిందని అన్నారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు అనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. రూ.72,000 కోట్లు సాఫీగా రైతుల ఖాతాలోకి పోయిన కార్యక్రమాన్ని గందరగోళంగా మారుస్తున్నదని, అంతిమంగా ఈ వ్యవహారం అవినీతికి దారి తీస్తుందని పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్​ను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుందని చెప్పారు.

'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్

బీఆర్‌ఎస్‌కు అధికారం మాత్రమే పోయింది, పోరాటతత్వం కాదు: కేటీఆర్‌

Last Updated : Dec 30, 2024, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details