Posters in Siddipet Demanding that Harish Rao Resign from MLA Post : సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ అయిందని, హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఫ్లెక్సీలు తీసేయడానికి అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే ఎలా? : 'నా అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనం. తాళాలు పగులగొట్టి, ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికం. దాడిని ఆపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుంది. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే పౌరులకు భరోసా ఏది? దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలి.' అని హరీశ్‌రావు అన్నారు.
కేటీఆర్ ట్వీట్ : మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మరో ట్వీట్లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు అని, ప్రేమ బజార్లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకునే వ్యక్తికి, ఇవి కనిపించడం లేదా అని కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.