Excitement among TDP 2nd list Candidates:వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తొలిజాబితా కింద 94మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం మలి జాబితా అభ్యర్థుల్ని నేడు ప్రకటించనుంది. పొత్తులో భాగంగా 31అసెంబ్లీ స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించటంతో మరో 50మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. అలాగే 8 పార్లమెంట్ స్థానాల్లో జనసేన, బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయించినందున 17మంది పార్లమెంట్ అభ్యర్థుల్నీ తెలుగుదేశం ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం ఈ 67మంది అభ్యర్థుల్లో ఎంతమందిని మలిజాబితా కింద ప్రకటిస్తారనే ఉత్కంఠ ఆశావహులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
నేడు ఎంత ఎక్కువ మందిని వీలైతే అంతమందిని ప్రకటించేస్తామని అధినేత చంద్రబాబు స్పష్టం చేయటంతో ఆ సంఖ్య ఎంతనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. నేడు ప్రకటించేదే తుది జాబితా కాదనీ మరో జాబితా కూడా ఉండవచ్చనే సంకేతాలు పార్టీ అధిష్ఠానం నుంచి వస్తున్నందున 67మందిలో నేడు ఎంతమందికి చోటు దక్కుతుందనే సస్పెన్స్ నెలకొంది. సంఖ్యాపరంగా 9 అంకె సెంటిమెంట్‌ను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నందున నేడు ప్రకటించే అభ్యర్థుల సంఖ్య ఎంత ఉంటుంది అని ఎవరి అంచనాల్లో వాళ్లు మునిగితేలుతున్నారు.
రాజకీయ రణక్షేత్రంలో కీలకంగా కోస్తాంధ్ర - ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడతారా?
బీజేపీ, జనసేనలకు కేటాయించే పార్లమెంట్ స్థానాలపై ఇప్పటికే నేతలకు స్పష్టత వచ్చినందున జనసేన, బీజేపీలకు వెళ్లే 31అసెంబ్లీ స్థానాలు ఏంటనే చర్చా నెలకొంది. అరకు, విజయనగరం, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా కాకినాడ, మచిలీపట్న స్థానాల్లో జనసేన పోటీచేయనుంది. తమకు కేటాయించిన 21అసెంబ్లీ స్థానాల్లో జనసేన 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేయటంతో మరో 15మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బీజేపీ పోటీ చేసే 10 స్థానాలు జనసేనతో కొన్ని ముడిపడి ఉన్నందున మొత్తం 25స్థానాలు ఏంటనేది తేలాల్సి ఉంది.
బీజేపీ, జనసేనలకు పలాస, పాడేరు, పాలకొండ, పెందుర్తి, భీమిలి, మాడుగుల, యలమంచిలి, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, అమలాపురం, రాజోలు, పిఠాపురం, రామచంద్రపురం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, ఉంగుటూరు, కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు పశ్చిమ, తిరుపతి, రాజంపేట, అనంతపురం అర్బన్, ధర్మవరం, రైల్వేకోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో ఏ 25స్థానాలు వెళ్తాయనే సస్పెన్స్ ఆశావహుల్లో ఉంది. అలాగే తొలిజాబితాలో తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించిన పి.గన్నవరం స్థానం ఆ పార్టీకే ఉంటుందా లేక పొత్తులో భాగంగా ఎటైనా మారుతుందా అనే చర్చా లేకపోలేదు.
'కలలకు రెక్కలు' పథకానికి అనూహ్య స్పందన- 11,738 మంది యువత దరఖాస్తు
తెలుగుదేశం పోటీ చేసే 17పార్లమెంట్ స్థానాలను పరిశీలిస్తే శ్రీకాకుళం స్థానానికి రామ్మోహన్ నాయుడు తిరిగి పోటీ చేయనుండగా, విశాఖ నుంచి గీతం విద్యాసంస్థల అధినేత భరత్ బరిలో దిగే అవకాశం ఉంది. ఏలూరు పార్లమెంట్ స్థానానికి కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ, బీసీ సామాజిక వర్గం నుంచి ఓ పోలీస్ అధికారి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అమలాపురం స్థానానికి బాలయోగి తనయుడు గంటి హరీష్ పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేశినేని చిన్ని, గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటకు లావు శ్రీకృష్ణదేవరాయుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. బాపట్లకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అగ్గి రామయ్య, సౌరపు ప్రసాద్‌ల సీటు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా ?: నారా లోకేశ్
ఒంగోలు స్థానానికి మాగుంటు శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీచేసే అవకాశం ఉండగా, నెల్లూరుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. చిత్తూరు స్థానానికి దగ్గుమళ్ల ప్రసాద్, రాజంపేటకు సుకవాసి సుబ్రహ్మణ్యంల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కడపకు రెడ్డిప్పగారి శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలని భావిస్తుండగా వైఎస్ వివేక కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే సమీకరణాలు మరనున్నాయి. హిందూపురం పార్లమెంట్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, నిమ్మల కిష్టప్పల మధ్య పోటీ ఉండగా, అనంతపురంకి పూలం నాగరాజు లేదా మరొకరిని పరిశీలించవచ్చని తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురుబ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు, భవానీ శంకర్ల మధ్య పోటీ నెలకొంది. నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ఒకరు లేదా వేరెవ్వరనేది తేలాల్సి ఉంది.