jogi ramesh land mafia : మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాస రెడ్డి పెడన నియోజకవర్గంలోని తన భూమిని ఆక్రమించారని బంటుమిల్లికి చెందిన రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఎకరాలకు దొంగ దస్తావేజులు సృష్టించి భూములు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ అండతోనే భూ ఆక్రమణ సాగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. వీరి అక్రమాలకు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా ఉన్నారని ఆరోపించారు. భూమిని ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితుడు రంగబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
భూములు అమ్ముకోవడానికి వీల్లేకుండా వివాద జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోయారు. ఆ జాబితా నుంచి తమ భూములను తప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జోగికి 15 లక్షల రూపాయలు లంచం ఇచ్చామని తెలిపారు. తమకున్న 30 ఎకరాల భూమికి జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి దొంగ దస్తావేజులు తయారు చేయిస్తున్నారన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ద్వారా దొంగ దస్తావేజులతో తన భూమిని అమ్మేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ మాజీ మంత్రి జోగికి సహకరిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ చేసే అక్రమాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ పాత్ర కూడా ఉందని అన్నారు. ఐజీ రామకృష్ణకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. త్వరలో సబ్ రిజి స్ట్రార్ల బదిలీలు జరిగే లోగా తన భూమిని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ స్టేషనులో కూడా ఫిర్యాదు చేశానని రంగబాబు తెలిపారు.