ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

యధేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - అధికార పార్టీ ప్రచారంలో వాలంటీర్లు, ఇతర సిబ్బంది - YSRCP Election Code Violations - YSRCP ELECTION CODE VIOLATIONS

Election Code Violations by YSRCP Leaders: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారంలో హల్​చల్ చేస్తున్నారు. అటు వాలంటీర్ల కూడా వైసీపీ అభ్యర్ధులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇవాళ భారీ మొత్తంలో వాలంటీర్లపై ఈసీ కొరడా ఝుళిపించడం ఆసక్తిగా మారింది.

election_code_violations
election_code_violations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 9:36 PM IST

Election Code Violations by YSRCP Leaders:ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నా వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో తెలుగుదేశం నేత బూర్ల రామాంజనేయులుపై వైసీపీ నేతల దాడిపై కూటమి నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించి వాలంటీర్లతో సమావేశాలు పెట్టడమే కాకుండా తెలుగుదేశం నేతలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టడం దారుణమని నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు.

అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో వాలంటీర్‌ బుర్రి దానారావు అద్దంకి మండలం గోపాలపురంలో వాలంటీర్‌ కారుమంచి నారాయణ వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా తదనుగుణంగా చర్యలు తీసుకోవడంలో అధికారులూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొరిశపాడు మండలం దైవాలరావూరు జగనన్న కాలనీలోని శిలాఫలకాలకు ఉన్న వైసీపీ రంగులను, వంతెనలపైనా పోస్టర్లను ఇప్పటికీ తొలగించలేదు.

చీరాలలో మీడియాకు తాయిలాలపై ఎన్నికల సంఘం ఆరాతీసింది. చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ మీడియాకు తాయిలాలు పంచారంటూ తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎండీ షరీఫ్ చేసిన ఫిర్యాదుతో ఎన్నికల సంఘం బాపట్ల జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా వివరణ కోరింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు చీరాల ఆర్వో సూర్యనారాయణ రెడ్డి వెంకటేష్‌కు నోటీసులు ఇచ్చారు.

తాడేపల్లికి చేరిన చిలకలూరిపేట 6.5 కోట్ల పంచాయితీ - జగన్​కు ఆధారాలు అందజేత

వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నేతల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటూ ఎన్నికల అధికారులకు ఇటీవల తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారులు 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం భోగాపురంలో యాదవ కార్పొరేషన్‌ డైరక్టర్‌ శేషగిరిరావు ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారంటూ కుసిపద్ర జగన్నాథపురానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు దేవేంద్రపై ఆర్వోకు ఫిర్యాదు అందింది. దేవేంద్ర ప్రచారంపై వివరాల అడిగామన్న ఆర్పో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు తేలితే విధుల నుంచి తొలగిస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా

పాస్ పుస్తకాలపై జగన్ చిత్రం: రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ చిత్రాన్ని ముద్రించడంతో బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల్లోనూ కొన్ని సడలింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థులు ఎదుర్కొనే సమస్యలపై ఈసీ దృష్టి సారించాలని నర్సీపట్నం ఆర్వోకు అయ్యన్న విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ శాఖ ఆధీనంలోని పలు యాప్‌లలో సీఎం జగన్‌ బొమ్మలతోపాటు వైసీపీ పార్టీ గుర్తులను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. వ్యవసాయ శాఖ వైఎస్ఆర్‌ యాప్, సీఎం యాప్‌లలో జగన్‌ పోటోతో పాటు వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్‌ నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తోంది. కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికారులు వీటిని తొలగించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యధేచ్చగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు - అధికార పార్టీ ప్రచారంలో వాలంటీర్లు, ఇతర సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details