EC Suspends Chandramouleshwar Reddy:తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమ ఓట్ల నమోదుపై ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు వేసిన ఎన్నికల సంఘం మరో అధికారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓ వర్గం గెలుపు కోసం పాటు పడ్డారంటూ ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన ఈసీ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. తాజాగా ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రమౌళీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై వేటు: తిరుపతిలో దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆర్‌వో లాగిన్‌తో 35 వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెడ్ చేసింది.
తాజాగా దొంగ ఓట్ల నమోదు ఘటనలో చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అసలు చంద్రమౌళీశ్వర్‌రెడ్డికి ఈఆర్‌వో బాధ్యతలను ఈసీ అప్పగించలేదని జీవోలో ఈసీ వెల్లడించింది. ఎపిక్ కార్డుల అక్రమ డౌన్‌లోడ్‌పై ఆయన పాత్ర తేల్చాల్సి ఉందని జీవోలో తెలిపింది. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తన పరిధి దాటి ఈఆర్‌వో విధులు నిర్వర్తించారని ఈసీ పేర్కొంది. ఘటనపై పోలీసులు పూర్తి విచారణ జరపాల్సి ఉందని జీవోలో ఈడీ పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికార కొందరు అధికారులు వైఎస్సార్సీపీకి తొత్తులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించాయి.