Discussion in Legislative Council on Sharada Peetham Lands :ప్రజావసరాల కోసం కాకుండా గురుదక్షిణ కోసం గత ప్రభుత్వం విలువైన భూముల్ని కారు చౌకగా శారదాపీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. కేటాయింపులో అన్ని నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ఈ క్రమంలోశారదాపీఠానికి భూముల కేటాయింపులపై శాసన మండలిలో అధికార, విపక్ష పార్టీల మధ్య చర్చ వాడీవేడీగా జరిగింది. ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు.
విశాఖలో రూ.300 కోట్లు విలువజేసే భూమిని రూ.15 లక్షలకు శారదాపీఠానికి గత ప్రభుత్వం అప్పగించిందని తెలిపారు. మార్కెట్ విలువ వసూలు చేయాల్సి ఉండగా పాటించలేదని తెలిపారు. ఎకరా రూ.1.5 కోట్లు విలువ ఉండగా కేవలం రూ.1 లక్షకే శారదా పీఠానికి భూములను కేటాయించిందని అన్నారు. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం పొందలేదని ఎన్వోసీ తీసుకోలేదని తెలిపారు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శారదా పీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేసినట్లు తెలిపారు.