Deputy CM Bhatti Lay Foundation Stone for BT Roads :రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్‌ను ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారంటీలను తీసుకువచ్చింది ఉద్ఘాటించారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు.
మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం :సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్పజెప్తామని చెప్పారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు. చింతకాని మండలం చేరుకొని రూ.175 లక్షలతో గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్లతో బోనకల్లు- అల్లపాడు- వంగవీడు గ్రామాల వరకు బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.