తెలంగాణ

telangana

ETV Bharat / politics

గులాబీ ఖాతా ఖాళీ చేసేందుకు 'ఆపరేషన్ చేవెళ్ల' - కాంగ్రెస్​ వ్యూహం మామూలుగా లేదుగా?

Congress Operation Chevella in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో బీఆర్​ఎస్​ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. వచ్చే లోక్​సభ ఎన్నికల్లోగా చేవెళ్ల పార్లమెంట్​లోని గులాబీ​ ఎమ్మెల్యేలు, శ్రేణులను తమవైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి "ఆపరేషన్ చేవెళ్ల" పేరుతో వేట మొదలుపెట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొంత మంది మాజీలతో పాటు మరో కారు పార్టీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

BRS MLAs Jump in Congress
Congress Operation Chevella in Rangareddy

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 8:45 PM IST

Congress Operation Chevella in Rangareddy :రంగారెడ్డి జిల్లా పశ్చిమాన రాజకీయం రసవత్తరంగా మారింది. లోక్​సభ ఎన్నికలకు ముందే బీఆర్​ఎస్​ను దెబ్బకొట్టాలన్న అధికార కాంగ్రెస్ పాచికలు గట్టిగానే ఫలిస్తున్నాయి. గత ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీని స్వల్ప మెజార్టీతో చేజార్చుకున్న కాంగ్రెస్, ఎంపీ సీటును దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. నోటిఫికేషన్ రాకముందే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాగా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆపరేషన్ చేవెళ్ల పేరుతో వేట మొదలుపెట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి

అందులో భాగంగా బీఆర్​ఎస్​ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ సునీత మహేందర్ రెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డి గాంధీభవన్​లో(Gandhi Bhavan) తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి దీప దాస్​మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి అధికారికంగా పార్టీ మారకపోయినా, బీఆర్​ఎస్​కు అనధికారికంగా బై బై చెప్పేశారు.

Patnam Sunita Mahender Reddy Join in Congress :ఈ పరిణామం తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో అలజడి సృష్టిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అంటే కస్సుబుస్సులాడిన మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఆయన చెంత చేరడం ఆపరేషన్ చేవెళ్లలో భాగమేనని అర్థమవుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మహేందర్ రెడ్డి కాంగ్రెస్​లోకి చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.

ఆ ప్రచారాన్ని మహేందర్ రెడ్డి పైపైకి ఖండిస్తూ వచ్చారు. విషయం తెలిసి బీఆర్​ఎస్​ అధిష్ఠానం ఆయన్ని బుజ్జగించి మంత్రి పదవి ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సతీమణి సునీత మహేందర్ రెడ్డిని ముందు నిలబెట్టి కాంగ్రెస్​లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న​ పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్

వచ్చే లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ తన భార్య సునీతకు ఇవ్వాలని మహేందర్ రెడ్డి పట్టుపట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో భార్య, కుమారుడ్ని పార్టీ మార్పించారు. అయితే మహేందర్ రెడ్డి కుటుంబం పార్టీ మారడటంలో చేవెళ్ల టికెట్ ఒకటే కారణం కాదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అధిష్ఠానం తాండూరు ఎమ్మెల్యే టికెట్ మహేందర్ రెడ్డిని కాదని రోహిత్ రెడ్డికి ఇచ్చింది. రోహిత్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన మహేందర్ రెడ్డి, అక్కడ పార్టీని గెలిపించలేకపోయారు.

నాటి పరిణామాలే కారణమా? : కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డికి పరోక్షంగా తన వర్గం చేత మద్దతు ఇచ్చారని బీఆర్​ఎస్​ శ్రేణులు ఆరోపించాయి. మహేందర్ రెడ్డి అండదండలంతోనే తాండూరులోకాంగ్రెస్ గెలిచిందని విమర్శలొచ్చాయి. మరోవైపు వికారాబాద్​లో సిట్టింగ్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​తో సునీత మహేందర్ రెడ్డికి విబేధాలు తలెత్తాయి. ఇలా భార్యభర్తలిద్దరికి గులాబీ పార్టీలో ఊపిరాడకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. అందుకే మొదటగా సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్​లో చేర్పించారు. చేవెళ్ల ఎంపీగా బరిలోకి దింపాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు.

చేవెళ్ల పార్లమెంట్​లో చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది. అలాగే ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మహేందర్ రాకతో కాంగ్రెస్ బలం మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్​లో చేరిన సునీతా మహేందర్ రెడ్డిపై వికారాబాద్ జిల్లా బీఆర్​ఎస్​ జడ్పీటీసీలు(BRS ZPTC) అవిశ్వాస తీర్మానం పెట్టారు.

లోక్​సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్​లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!

వికారాబాద్, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 12 మంది జడ్పీటీసీలు జాయింట్ కలెక్టర్ లింగ్యానాయక్​కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్​గా, ఆ తర్వాత వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన సునీతా మహేందర్ రెడ్డి కూడా తనకంటూ క్యాడర్​ను తయారు చేసుకున్నారు. అవిశ్వాసం నెగ్గినా చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలన్న నిర్ణయంతో ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Joinings :ఇక చేవెళ్ల పార్లమెంట్​ను గెలుపును నిర్దేశించే నియోజకవర్గాలైన మహేశ్వరం, రాజేంద్రనగర్​లో బీఆర్​ఎస్​ పాగా వేసింది. అక్కడ వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలే(Sitting MLA) అధికారంలోకి రావడంతో పార్లమెంట్​ ఎన్నికల్లో వారిని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. మాజీలతో పాటు, తాజా మాజీలపై కన్నేసింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని గతంలోనే కాంగ్రెస్​లోకి ఆహ్వానించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ మారుతామని నిర్ణయించుకున్న తీగల, బీఆర్​ఎస్​ అధిష్ఠానం సూచనతో ఆగిపోయారు.

14 లోక్​సభ స్థానాలే టార్గెట్ - గెలుపు గుర్రాల ఎంపికపై నేడు కాంగ్రెస్​ కీలక సమావేశం

సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తరఫున పోటీ చేసి ఆమెను గెలిపించారు. కానీ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తనతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్​గా ఉన్న తన కోడలు అనితా హరినాథ్ రెడ్డిని కూడా హస్తం గూటికి తీసుకొస్తున్నారు. త్వరలోనే మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నట్లు సమాచారం.

అటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రకాశ్ గౌడ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం(Congress leadership) నుంచి పిలుపు రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రకాశ్ గౌడ్ కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది.

Congress Targets on Parliament Elections :ఆపరేషన్ చేవెళ్ల పేరుతో బీఆర్​ఎస్​ను ఖాళీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, చేవెళ్ల ఎంపీ టికెట్​పై కాంగ్రెస్​లోనే పోటీ తప్పేలా లేదు. మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్​ఆర్ కూడా చేవెళ్ల ఎంపీ టికెట్​పై ఆశలు పెట్టుకున్నారు. తనకే ఎంపీ టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. టికెట్ కోసం దిల్లీ స్థాయిలో కేఎల్ఆర్ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఈటల​

ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే ఎంపీ సీటు - ఆశావహుల బలాబలాలపై కాంగ్రెస్​ ప్రత్యేక సర్వే!

ABOUT THE AUTHOR

...view details