Congress MP Candidates Telangana 2024 :రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్పార్టీ సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తును మరింత వేగవంతం చేసింది. రెండు రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటీ సమావేశమై నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. 17 లోక్‌సభ స్థానాల్లో (Telangana Lok Sabha Elections 2024) కనీసం 14 లోక్‌సభ స్థానాలైనా హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా, పార్టీల వారీగా సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు సర్వే ద్వారా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
Telangana Lok Sabha Elections 2024 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, నాలుగు గ్యారెంటీల అమలు కలిసివస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించడం, రైతు బంధు అమలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖలపై లోతైన దర్యాప్తు, నీటి ప్రాజెక్టుల్లో అవినీతి బహిర్గతం, ప్రజాధనం దుర్వినియోగం జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి లోతైన దర్యాప్తు జరిపించిన విషయమూ తెలిసిందే.
రాష్ట్రంలో మరింత మెరుగైన కాంగ్రెస్ పరిస్థితి - 12 లోక్‌సభ స్థానాల్లో పెరిగిన ఓటర్ల శాతం
మరోవైపు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న దాదాపు రెండున్నర లక్షల ధరణి దరఖాస్తుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 9వ తేదీ వరకు ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలలో సమస్యల పరిష్కారానికి సమయాన్ని సైతం నిర్దేశించింది. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో క్షేత్రస్థాయిలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేల్లో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అధిక సీట్లు గెలుచుకోగలమన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.
Congress MP Candidates Latest Updates :ఇటీవల సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై ఒక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పేరు, కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచల రాజేందర్‌రావుల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరుతో పాటు ఉజ్వల రెడ్డి, సిద్ధా రెడ్డి పేరూ తెరపైకి వచ్చింది.