Raghuram Reddy Wins Khammam Lok Sabha Election 2024 : రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. చివరకు 3.5 లక్షల భారీ మెజార్టీతో ఆయన ఈ ఎన్నికలో విజయం సాధించారు. మొదటి నుంచి ముందంజలో నిలిచిన ఆయన ఖమ్మం సీటును కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపాలా అని ఎన్నో రోజులు మల్లగుల్లాలు పడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. చివరికి పంచాయతీ దిల్లీ వరకు చేరుకుంది. ఆఖరి క్షణంలో హస్తం పార్టీ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని ఎంపిక చేసింది.
Congress Wins Khammam Lok Sabha Seat: ప్రధాన పార్టీ ప్రముఖ నాయకులందరూ ప్రచారంలో హోరెత్తించారు. ఖమ్మంపై పాగా వేస్తామని బీజేపీ అంటే, మరోసారి గెలిచేది మేమే అంటూ బీఆర్ఎస్ పాట పాడింది. ఇక కాంగ్రెస్ మాత్రం లేటుగా అభ్యర్థిని ప్రకటించినా లేటెస్టుగా ప్రచారాన్ని హోరెత్తించింది. మొత్తం ఈ లోక్సభ స్థానం నుంచి 51 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల కౌంటింగ్లో మాత్రం కాస్త ఉత్కంఠ తగ్గింది. మొదటి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ వచ్చారు. చివరికి అధిక మెజారిటీతో గెలుపొందారు.