CM YS Jagan New Strategies for Public Meeting: విపక్షంలో ఉండగా పాదయాత్రతో జనంలో తిరిగిన జగన్, అధికారంలోకి రాగానే పరదాల మాటున,ఆకాశ మార్గాన తప్ప తిరగడంలేదు. ఆయన కోరుకుంటే తప్ప ఎమ్మెల్యేలకే నాలుగేళ్ల పాటు దర్శనభాగ్యం ఇవ్వలేదని వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, పంచకర్ల రమేష్‌బాబు వంటి నేతలు బాహాటంగానే విమర్శించిన వేళ, మళ్లీ కార్యకర్తల మధ్యకు వస్తున్నట్లుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. భీమిలి బహిరంగ సభలో గ్యాలరీలకు దగ్గర ర్యాంప్‌వాక్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస వద్ద జాతీయ రహదారి పక్కన జగన్ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎన్నికల శంఖారావంగా భావిస్తున్న సభకు 34 నియోజకవర్గాల కార్యకర్తలు, గృహసారథులు హాజరవ్వాలని హుకుం జారీ చేశారు! ఇటీవలవిజయనగరంజిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద తెలుగుదేశం యువనేత లోకేశ్ యువగళం ముగింపు సభ విజయవంతమైంది. ఆ సభను మించి విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి టార్గెట్లు పెట్టి ఆదేశాలిచ్చారు.
అయితే డ్వాక్రా గ్రూపు మహిళలను బలవంతంగా సభ వద్దకు తరలించినా ఎక్కువసేపు ఆపే పరిస్థితి లేదని, సాధికారిక యాత్రల్లో ఇది స్పష్టమైందని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లోకి వెళ్లిన కార్యకర్తలు, మహిళలు బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల మధ్య జగన్ తిరిగేలా సభ ముందు ‘టీ’ ఆకారంలో ర్యాంప్ ఏర్పాట్లు చేశారు.