CM Revanth Reddy Kodangal Tour : లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసి, తన గౌరవాన్ని తగ్గించేందుకు కొందరు కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలో రేవంత్ రెడ్డి(CM Revanth Questions BRS and BJP)ని ఎందుకు కింద పడేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమవారం కొడంగల్‌లో పర్యటించిన సీఎం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. 50 వేల అధిక్యంతో కాంగ్రెస్‌ను గెలిపించి కొడంగల్‌పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం కొడంగల్‌లోని తన నివాసానికి సీఎం చేరుకున్నారు. అక్కడ నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చల్లావంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
"రేవంత్ రెడ్డి పరపతిని ఎట్లా అయిన తగ్గించాలని విపక్షాలు చూస్తున్నాయి. అందుకు కొడంగల్‌లో మెజార్టీ అయిన తగ్గించి రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్ఠను దెబ్బతీయడం. కొడంగల్ అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. మెడికల్ కాలేజీ తెచ్చినందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలా? కరవు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతాన్ని రూ.4000 కోట్లతో నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకుని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కిందపడేయాలా?"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సీరియస్ - ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్