Telangana Assembly Sessions 2024:తెలంగాణరాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం సహా అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ సంతాప తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు.
అసెంబ్లీ సమావేశం తొలిరోజు సమావేశం తర్వాత బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మినహా ఈనెల 31వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అవసరమైతే మరొకసారి బీఏసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.
మరోవైపు లాస్యనందిత మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని సీఎం రేవంత్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారని గుర్తు చేశారు. సాయన్న వారసురాలిగా లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ప్రమాదవశాత్తు ఆమె మరణించడం బాధాకరమని సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"సాయన్న మృదుస్వభావి. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని సాయన్న కోరిక. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరు. లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి