CM Jagan Introduced Anakapalli YSRCP MLA Candidates :అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా సౌమ్యులు, మంచివాళ్లేనట! సిద్ధం పేరుతో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార యాత్ర చేస్తున్న ఏపీ సీఎం జగన్ తన బస్సులో 'మంచివాడు, సౌమ్యుడు' అన్న సర్టిఫికెట్లనూ పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు! పార్టీ అభ్యర్థులందరికీ బీఫాంల కంటే ముందు ఆయన ఈ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని నర్సింగపల్లెలో శనివారం ఎన్నికల ప్రచార సభలో పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూ అందరికీ మంచివాడు, సౌమ్యుడు అని కితాబిచ్చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహారశైలి, దందాలతో విసిగిన ప్రజలు సీఎం మాటలు విని 'అవునా నిజమా?' అని ముక్కున వేలేసుకున్నారు. అందరూ సౌమ్యులే అయితే దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అరాచకాలకు బాధ్యులెవరో సీఎం చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
యు.వి.రమణమూర్తిరాజు(కన్నబాబు) :అభివృద్ధి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో, ఏదైనా పథకం తమకెందుకివ్వలేదనో నియోజకవర్గ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు కన్నబాబు అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఆయన నోటి నుంచి బూతులు ప్రవాహంలా వచ్చేస్తాయి. 'గట్టిగా మాట్లాడితే పళ్లు పీకేస్తా' అని బెదిరింపులకూ దిగుతారు. అలాంటి కన్నబాబుకే సౌమ్యుడని సీఎం కితాబివ్వడంతో జనం ఆశ్చర్యపోయారు. మరి ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కరిగిన కొండలకు, మాయమైన మట్టికి బాధ్యులెవరో కూడా సీఎం చెప్పొచ్చు కదా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోకి కొత్తగా ఏ పరిశ్రమ వచ్చినా నిర్మాణ సామగ్రి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు అడ్డుకునేదెవరో, వివాదాస్పద భూములపై వాలిపోయేదెవరో సీఎం కాస్త కనుక్కుని ప్రజలకు వివరించి ఉంటే బాగుండేది.
పెట్ల ఉమాశంకర్ గణేష్ : ప్రతిపక్ష నేతలపై బండబూతులతో విరుచుకుపడే గణేష్ ఎంత సౌమ్యుడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గిరిజనులు వ్యతిరేకించినా లెక్కచేయకుండా లేటరైట్ క్వారీల తవ్వకాలకు మార్గం సుగమం చేసిన వాళ్లెవ్వరో గణేష్‌కు బాగా తెలుసునని నియోజకవర్గ ప్రజలంటున్నారు. అనుచరగణంతో దందాలు చేస్తున్నవారు, ఇసుక, మట్టి యథేచ్ఛగా తవ్వేస్తున్నవారు, కొవిడ్ సమయంలో ఆసుపత్రిలో మాస్క్ ఇవ్వలేదని అడిగిన ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్‌ను ఇబ్బందులకు గురిచేసిన వారెవరో గణేష్‌కు బాగా తెలుసునని వారెవరో సీఎం కనుక్కుని చెబితే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కరణం ధర్మశ్రీ : నియోజకవర్గంలో తరతమ భేదాలు లేకుండా ఏ పనికైనా కమీషన్లు పిండేసే ఇసుక, కంకర, మట్టి తవ్వకాల్లో వాటాలు నొక్కేసే వాళ్లెవరో ధర్మశ్రీకి బాగా తెలుసునని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తూ, సోదరుడితో అన్ని పనులూ చక్కబెడుతున్న వాళ్లెవరో ధర్మశ్రీనే అడిగి చెప్పాలని కోరుతున్నారు. పార్టీ కార్యకర్తల్ని, ఉద్యోగుల్ని బెదిరించి చిట్‌లు కట్టించుకుంటున్నవారి సమాచారమూ ధర్మశ్రీ వద్దే ఉందని అంటున్నారు. అవేంటో ముఖ్యమంత్రే తెలుసుకుని మాకు కూడా చెప్పొచ్చు కదా? అని ప్రజలు అడుగుతున్నారు.