CM Jagan Interact With Public in Erraguntla: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి కాస్తా భజన సభగా మారిపోయింది. నేతలు గ్రామస్థులతో ముఖాముఖి అని చెప్పి వారు ఎలా మాట్లాడాలో ముందే సిద్ధం చేశారు. జగన్ అక్కడకు వచ్చిన వెంటనే భజన మొదలుపెట్టారు. మాట్లాడిన వారందరూ జగన్‌పై పొగడ్తలతోనే సరి పెట్టారు. ఎర్రగుంట్లలో నిర్వహించిన సమావేశం(Meeting) మొత్తం జగన్‌ను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు ప్రజలతో మాట్లాడించారు.
IPAC TEAM Training To Beneficiaries : ఐప్యాక్ సభ్యుల ఆధ్వర్యంలో ముందే పలువురు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. కొందరు మాట్లాడిన తీరు చూస్తే బట్టీకొట్టి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించారు. పాస్ ఉన్నవారు తప్ప వేరెవ్వరూ అక్కడికి రాకుండా చేశారు. పాస్‌లు ఉన్నవారిని సెల్‌ఫోన్లు, పెన్నులు, పుస్తకాలు వంటివి తీసుకెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ముఖాముఖిని గుట్టుగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తానికి పరదాలు కట్టేసి లోపల ఉన్నవారికి తప్ప బయట ఉన్నవారికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ యర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉండగా అందులో 1,391 ఇళ్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. అన్ని పథకాల ద్వారా రూ.48.74 కోట్ల ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. తర్వాత ప్రజలతో సీఎం ముఖాముఖి ప్రారంభమైంది. తన కుమార్తెకు కళ్లు కనిపించవని పింఛను అందట్లేదని సీఎం సమక్షంలో ఒకరు రోదించగా కారణాలు తెలుసుకుంటానని ఆయన సమాధానమిచ్చారు.
అంతా వైసీపీ కార్యకర్తలే :యర్రగుంట్లకు చెందిన పుష్పలత సీఎం జగన్‌నుపొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమ పథకాలతో(Welfare Schemes) లాభం పొందానని వచ్చే ఐదు సంవత్సరాలు జగనే సీఎం కావాలని అన్నారు. గోవిందపల్లెకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు వాణి సాధారణ పౌరురాలిలా మాట్లాడారు. మహిళా సాధికారత జగన్‌తోనే సాధ్యమని ఈ పాలనలో పేదరికం, అవినీతి తగ్గుతున్నాయని ఆమె అన్నారు. ఆళ్లగడ్డకు చెందిన అపర్ణ, ప్రసాద్ అనే దివ్యాంగ దంపతులు తమను తాము జగన్ అభిమానులుగా పేర్కొంటూ ప్రసంగించారు. తామిద్దరికి నెలకు రూ.6 వేల పింఛను అందుతోందని, జగన్ చిత్రపటాన్ని గీసి చూపించారు.