CM Jagan Focus on YSRCP 7th Incharge List : వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల ఏడో జాబితాపై తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సీఎంవో చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ, నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakara Reddy) ముఖ్యమంత్రి జగన్‌తో బుధవారం భేటీ అయ్యారు. మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy)తోపాటు ఆదాల కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ వేమిరెడ్డి వ్యవహారంతోపాటు నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై వారి మధ్య కొంత చర్చ జరిగినట్లు తెలిస్తోంది.
YSRCP Incharge Change :ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి, అక్కడ టికెట్ రేసులో ఉన్న కప్పట్రాళ్ల బొజ్జమ్మతో ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసుకోవాలని సీఎం వారిద్దరికీ చెప్పినట్లు తెలిస్తోంది. తిరిగి అధికారంలోకొస్తే తగిన గుర్తింపునిస్తామని బొజ్జమ్మకు హామీ ఇచ్చారని సమాచారం. తర్వాత విరూపాక్షితో మాట్లాడిన సీఎం నియోజకవర్గంలో బొజ్జమ్మ, ఆమె వర్గం మీకు సహకరిస్తారని, కలిసి పనిచేసి, పార్టీని గెలిపించుకు రావాలని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆలూరు ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించినప్పటికీ ఆయన పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఆలూరు టికెట్టే కావాలని పట్టుబడుతున్నారు.
వైసీపీలో కుప్పకూలిన టాప్ఆర్డర్... 'నైట్ వాచ్మెన్'దే భారం
మంగళగిరి ఇన్‌ఛార్జ్ మార్పు? : మంగళగిరి అభ్యర్థిని మార్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నుంచి లోకేశ్ పోటీ చేస్తుండటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం ఆ టికెట్‌ని మహిళకు కేటాయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవికి స్థానిక నేతలతో వర్గపోరు కారణంగా పార్టీ బలహీనపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాండ్రు కమలకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ హనుమంతరావు వర్గం కోరగా సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌ను మారుస్తారని విస్తృత ప్రచారం నేపథ్యంలో నేతలంతా మూడు రోజుల నుంచి సీఎంవో చుట్టూ తిరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.