Global Renewable Energy Investors Meet: ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (Global Renewable Energy Investors Meet)లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు.
1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధిరేటు సాధారణంగా ఉండేదన్నారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారత్ వాసి ఉంటున్నారని, ప్రతి నలుగురు భారత ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగురాష్ట్రాల వ్యక్తి అని తెలిపారు. ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందన్నారు. గతంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవన్న సీఎం, విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రమోట్ చేయాల్సి ఉందన్న సీఎం, విద్యుత్ బిల్లుల కట్టడికి ఆర్‌ఈతో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలన్నారు. గ్రిడ్ నిర్వహణకు సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థ మెరుగు పర్చాలని, గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ద్వారా నేరుగా ట్రాన్స్‌మిషన్ చేయాలని, మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్‌ను ప్రమోట్ చేయాల్సి ఉందన్నారు.
క్లీన్ ఎనర్జీ ప్లాంటుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నారు. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, గ్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. నెడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు.