CM Chandrababu Dissatisfied with TDP MLA Candidates :వైఎస్సార్ జిల్లా రాజంపేటలో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వయంగా ప్రచారానికి రావడంతో పాటు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సైతం ప్రచారం చేయడంతో పాటు రాజంపేటను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత సైతం ఓటమి చెందడం ఏమిటని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యంని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వారి వల్లే ఓడిపోయిందా? : రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుని రాజంపేటలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సగవాసి బాలసుబ్రహ్మణ్యం కలిశారు. ఓటమికి గల కారణాలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ కంచుకోటలాంటి రాజంపేటలో ఓడిపోవడం ఏమిటంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఓటమికి కారణాలను బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబుకు వివరిస్తూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో చాలా మంది హడావుడి చేశారు తప్ప, చివరకు ఆశించినంతగా పార్టీకి పని చేయలేదంటూ తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీలో చిరకాలంగా ఉన్న వారికి ప్రాధాన్యం లేకపోవడంతో నష్టం జరిగిందని వివరించారు. వ్యూహాత్మకంగా కొందరు వైఎస్సార్సీపీ అనుకూలంగా పని చేశారని, ఓటమి భయంతో వైఎస్సార్సీపీ భారీగా నిధులు వెచ్చించిందని చంద్రబాబుకు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పరిస్థితి తనకే మాత్రం సంతృప్తికరంగా లేదని చంద్రబాబు అన్నారని సమాచారం.