Chandrababu White Paper on Capital Amaravati :గత ప్రభుత్వ మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దానిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో ఈ శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశా నిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది.
ఐదేళ్లలో అమరావతి రాజధానిని ఉద్దేశపూర్వకంగా విస్మరించి చేసిన విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయం తో గత ప్రభుత్వం చేసిన అమరావతి నిర్మాణం నిలిపివేసింది. దీంతో గడచిన ఐదేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో దాదాపు 9 వేల కోట్ల రూపాయల వ్యయం తో చేసిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య అప్పటి ప్రభుత్వం నిర్మించిన రాష్ట్ర సచివాలయం, ఏపీ హైకోర్టు మినహా మరే కార్యాలయం ప్రస్తుతం రాజధానిలో పూర్తి స్థాయిలో పని చేయడం లేదు.
ప్రత్యేకించి గవర్నమెంట్ సిటిలో చేపట్టిన నిర్మాణాలు 5 సచివాలయ, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ, రాజ్ భవన్, సీఎం నివాసం, ఐఏఎస్ నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాస భవనాలు ఇలా వేర్వేరు నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వాటి పునర్నిర్మాణం పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు అంశాలనే శ్వేత పత్రంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్ల ఏపీ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పురోగతి పరంగా, సామాజికంగా, ఆర్థికం గా రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.