CM CBN Comments on Budget : కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకూ ఆమోదించారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని తెలిపారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కూరుకుపోయి ఉందన్న చంద్రబాబు, అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా, దాదాపు 30ఏళ్ల తర్వాతే తీర్చేదన్న సీఎం, అది అప్పటికి అంత భారమేమీ కాదని అన్నారు.
వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందనీ, మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుందని తెలిపారు. వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా కాపిటల్ అసిస్టేన్స్ రూపేణా కలుస్తుందన్న ముఖ్యమంత్రి అది లాభమేనన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం చెప్పటం మనకి చాలు కదా అని వ్యాఖ్యానించారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని తమకు సమాచారముందన్న చంద్రబాబు.. ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఏపీ ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది - టీడీపీ ఎంపీల హర్షం - TDP MPs Response on Budget