Chandrababu Raa Kadali Ra Meeting: నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. జనానికి మరింత సేవ చేసేందుకే తెలుగుదేశంలో చేరినట్లు వేమిరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తానని వేమిరెడ్డి హామీ ఇచ్చారు.
ఇటీవల వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అజాత శత్రువు అని, ప్రజా సేవకు మారుపేరు అని చంద్రబాబు కొనియాడారు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారని, వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సేవే ఏకైక ఉద్దేశంతో వేమిరెడ్డి వచ్చారన్న చంద్రబాబు, నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోతోందని తెలిపారు. పార్టీలోకి వస్తున్న ప్రతిఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని, న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అన్నారు.
టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
రాష్ట్ర ప్రజానీకం కోసం అందరూ ఆలోచించాలి: రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులకు పార్టీలోకి స్వాగతిస్తున్నానని, ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ (CM YS Jagan Mohan Reddy) పని అని చంద్రబాబు మండిపడ్డారు. అహంకారంతో రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారన్న చంద్రబాబు, రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్ విధానాలు నచ్చక తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని, ఐదుకోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ప్రజాసేవకు అంకితమైన ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.
విశాఖను దోచేసిన వ్యక్తి నెల్లూరుకు: రాబోయేది తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమేనని, విశాఖను దోచేసిన వ్యక్తిని వైసీపీ నెల్లూరుకు పంపుతోందని పేర్కొన్నారు. జగన్ ఓడిపోవడానికే సిద్ధం అంటున్నారా అని ఎద్దేవా చేశారు. ఒకాయన బుల్లెట్ దిగిందా అంటుండే వారని, ఆయన్ను జగన్ బదిలీ చేశారని తెలిపారు. పల్నాడులో ఆయనకు కరెక్ట్‌గా బుల్లెట్ దిగితే ఇటు రాడని, నేరుగా చెన్నైకే వెళ్లిపోతాడని అన్నారు. ఇప్పటివరకు ఆరుగురు ఎంపీలు, పదిమంది ఎమ్మెల్యేలు వైసీపీని వదిలేశారని పేర్కొన్నారు.
కందుకూరు సీటు ఇప్పటికి మూడుసార్లు మార్చారని, కనిగిరిలో చెత్త అయితే కందుకూరులో బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. జీడీ నెల్లూరులో కూడా మూడుసార్లు మార్చేశారన్న చంద్రబాబు, ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా అభ్యర్థులను మార్చేస్తున్నారని అన్నారు. డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలను భయపెట్టి మీటింగ్‌లకు తరలిస్తున్నారని విమర్శించారు.