Chandrababu Praja Galam Meeting in Yemmiganur: భూస్వాములు, పెత్తందారుల పార్టీ వైసీపీ అయితే, అన్ని వర్గాల పేదలను పైకి తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు నాయుడు అన్నారు. కులాల పేరుతో బీసీలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులుకు గురిచేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరంగా కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో తేరుబజారు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్తకుప్పలోకి పోతుందని చంద్రబాబు విమర్శించారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, టీడీపీ హయాంలో సాగునీటికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సీమలో వైసీపీ హయాంలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. జగన్‌ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: తమ పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలిజీని తప్పుడు వార్తలకు సృష్టిస్తున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని, కూలీ పనుల కోసం సీమ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దన్న చంద్రబాబు, జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు అని విమర్శించారు.