Chandrababu Pawan Kalyan Meeting: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉదయం నుంచి రెండుసార్లు భేటీ అయ్యారు.. సీట్ల ఖరారుపై చంద్రబాబు- పవన్ కల్యాణ్ దాదాపు 3గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఇరువురు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. పొత్తుల వల్ల రెండు పార్టీల్లో సీట్లు కోల్పోతున్న ఆశావహులకు ఆయా పార్టీల అధిష్టానం నచ్చజెప్పి... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆపై సీట్ల సర్దుబాటుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ ఈ రాత్రికే తిరిగి మరోసారి భేటీ అవుతారనే చర్చ... ఇరు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుది కసరత్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, కీలక భేటీలో పాల్గొన్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నుంచి తన సొంత వాహనంలో తానే నడుపుతూ పవన్ ఒక్కరే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయన వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఆయన భద్రతా వాహనశ్రేణి విడిగా అక్కడికి చేరుకుంది. తన నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పవన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ మాత్రమే భేటీలో పాల్గొన్నారు. చంద్రబాబు నివాసంలో భోజనం చేసిన పవన్‌కళ్యాణ్ టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే ప్రకటించగా, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అదే స్థానం నుంచి తిరిగి జనసేన అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
BRS పార్టీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
గత 4రోజుల నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసిన చంద్రబాబు, పవన్ అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ భేటీపై తెలుగుదేశం - జనసేన నేతలు, శ్రేణుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించినందున, తెలుగుదేశం - జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పిస్తానని నేతలకు స్పష్టం చేశారు. జనసేన తాము పోటీ చేసే వాటిలో ఎక్కువ స్థానాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే కోరినట్లు తెలుస్తోంది.