ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పసుపు దళానికి అతడే ఒకసైన్యం - రాజకీయచాణక్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రుడు - chandrababu naidu strong comeback

Chandrababu Naidu Strong Comeback: ఆయనకు జయాపజయాలు కొత్తకాదు! పోరాటాలు కొత్త కాదు! పదవులూ కొత్త కాదు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ సంక్షోభాలకు ఎదురొడ్డారు. కిందపడిన ప్రతీసారీ ఉవ్వెత్తున పైకి లేచారు. కానీ అవన్నీ ఒక ఎత్తు! గత ఐదేళ్ల రాజకీయం మరో ఎత్తు! పార్టీ పనైపోయిందనే సూటిపోటి మాటలు! ఆనవాళ్లే లేకుండా చేస్తామని హెచ్చరికలు! భౌతిక దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు! చివరకు కక్షగట్టి జైలుకు పంపినా ఆయన గుండె తట్టుకుంది. తిరగబడింది. వైఎస్సార్సీపీ ముప్పేట దాడిని రాజకీయ చాణక్యంతో ఎదుర్కొన్న చంద్రబాబు పసుపు కోటకు అతడే ఒక సైన్యమని నిరూపించుకున్నారు.

Chandrababu Naidu Strong Comeback
Chandrababu Naidu Strong Comeback (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 7:35 AM IST

పసుపు దళానికి అతడే ఒకసైన్యం - రాజకీయచాణక్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రుడు (ETV Bharat)

Chandrababu Naidu Strong Comeback: 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం ఎన్నో ఎన్నికలు ఎదుర్కొంది. ఎన్నో గెలుపోటములు రుచిచూసింది. కానీ, 2019 ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది! అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తి చూపుతూ ఇక పార్టీ పనైపోయిందని వైఎస్సార్సీపీ దెప్పిపొడిచింది.

తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం సైకిల్‌ దిగి వైఎస్సార్సీపీ పంచన చేరారు. అటు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఎంపీలు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ భాజపాలో చేరిపోయారు. ఇక తెలుగుదేశం ఖాళీయేనంటూ వైఎస్సార్సీపీ లోలోపల సంబరపడింది. కానీ, చంద్రబాబు కుంగిపోలేదు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి అనుకుని కదన రంగంలోకి దిగారు. కాలచక్రం ఐదేళ్లు తిరిగొచ్చేసరికి పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు.

జగన్‌ చేసిన పాపాలే చంద్రబాబు విజయానికి మెట్లు! - People Belief Towards Chandrababu

జగన్‌ కక్షా రాజకీయాలు ఎదుర్కొని: 2014 నుంచి 2019 వరకూ కొత్త రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టంతా కేంద్రీకరించిన చంద్రబాబు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. కనీసం పార్టీ కార్యాలయం కూడా కట్టించుకోలేకపోయారు. అనూహ్యంగా అధికారం కోల్పోవడంతో ఆయనకు ఓ ఆఫీస్ అంటూ లేకుండాపోయింది! విపక్ష నేతగా ప్రజావేదికను ఉపయోగించుకుందామనుకుంటే చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేయాలని పంతం పట్టిన జగన్‌ దాన్ని కక్షగట్టి కూల్చేయించారు. కొంతకాలం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్నే రాష్ట్ర కార్యాలయంగా చంద్రబాబు వాడుకున్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయం సిద్ధమయ్యాక అందులోకి మారారు.

అక్కడా చంద్రబాబును కుదురుకోనీయకుండా చేయాలని చూశారు. జలవనరులను విధ్వంసం చేసి పార్టీ కార్యాలయం కట్టారంటూ నోటీసులు ఇచ్చారు. ఇక చంద్రబాబు అద్దెకు ఉండే ఉండవల్లిలోని నివాసం కూడా కరకట్టను ఆక్రమించి కట్టారని గోలచేశారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగరవేయించారు. ఇలా అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే జగన్‌ కక్షా రాజకీయాలు ఎదుర్కొని చంద్రబాబు పార్టీని నిలుపుకొన్నారు.

అరాచకాలపై అలుపెరగని పోరు: పార్టీ ఘోరపరాజయం తర్వాత చంద్రబాబు నాయకత్వ పటిమతో క్యాడర్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు విజయ గర్వాన్ని తలకెక్కించుకుని తెలుగుదేశం శ్రేణులపై కాలకేయుల్లా దాడులకు దిగుతుంటే ఒక బాహుబలిలా పసుపు సైనికులకు ధైర్యం నూరిపోశారు చంద్రబాబు! ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్సీపీ దాడులకు భయపడి ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న కార్యకర్తల కుటుంబాలకు గుంటూరులో కొన్నాళ్లపాటు ఆశ్రయం ఏర్పాటు చేయించారు. నేనే స్వయంగా సొంతూళ్లలో దిగబెడతానంటూ ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఐతే చంద్రబాబును వెళ్లనీయకుండా పోలీసులతో ఇంటి గేట్లకు తాళ్లు బిగించారు. ఆ తాళ్లే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉరితాళ్లని హెచ్చరించిన చంద్రబాబు ఐదేళ్లూ వైఎస్సార్సీపీ అరాచకాలపై అలుపెరగని పోరు సాగించి పార్టీ శ్రేణులను కదంతొక్కించారు.

స్వ‌చ్ఛ‌రాజ‌కీయాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ - ప్ర‌జ‌ల మ‌నిషిగా ఎదిగిన నారా లోకేశ్ - nara lokesh inspirational journey

ఆర్థిక తోడ్పాటు అందించి అండగా నిలిచి: మొదట చెట్టుకొమ్మలు నరకడం, ఆ తర్వాత చెట్టునే మొదలుకంటా కొట్టేయడం కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు నైజం! తెలుగుదేశంపైనే అలాంటి కత్తే వేలాడదీశారు జగన్‌! ప్రతీకార దాడులకు తెరతీశారు! అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ వంటి కీలక నేతలపై ఆధారాల‌్లేని కేసులు వేసి జైళ్లకు పంపారు. చంద్రబాబును ఏకాకిని చేయాలనుకున్నారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప లాంటి నేతలపై అత్యాచారం కేసులు పెట్టారు. పల్నాటి పులిగా బతికిన కోడెల శివప్రసాద్‌పై దొంగతనం నెపం మోపి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు. పల్నాడులోనైతే గ్రామ, మండల స్థాయి టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ మూకలు అంతమొందించాయి. తెలుగుదేశం కుటుంబపెద్దగా వాళ్లందరికీ న్యాయపరంగా సాయం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించి అండగా నిలిచారు చంద్రబాబు. కుటుంబాన్ని, కార్యకర్తల్ని సమానంగా చూసుకుంటూ వచ్చారు.

ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సముదాయిస్తూ: రాజకీయ జీవితంలో ప్రజా పోరాటాలు చేసిన చంద్రబాబుకు జగన్‌ గూండాగిరీని ఎదుర్కోవడం కొత్తలో కొంచెం ఇబ్బంది అనిపించినా ఆ తర్వాత అలవాటు పడిపోయారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లి యుద్ధవాతావరణం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోకి వైఎస్సార్సీపీ మూకలు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఇక వైఎస్సార్సీపీ అరాచకాలను ఎప్పటికప్పుడు మీడియా దృష్టికి తెచ్చే పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై వైఎస్సార్సీపీ కిరాయి గూండాలు హత్యాయత్నం చేశారు.

చివరకు ఇంటిపైనా దాడి చేసి కుటుంబాన్నీ భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు చంద్రబాబు రాజధాని పర్యటనలకు వెళ్తే బస్సుపై రాళ్లతో దాడులు చేయించారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో భాగంగా యర్రగొండపాలెం, అంగళ్లు పర్యటనల్లోనూ చంద్రబాబు లక్ష్యంగా దాడులకు దిగారు. ఎన్​ఎస్జీ గార్డుల అప్రమత్తతతో బయటపడిన బాబు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పోగాలం దగ్గరపడిందంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సముదాయిస్తూ ముందుకు సాగారు. ఇలా పసుపు సేనల్ని చెల్లాచెదురు చేసి, అధినేత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎన్ని దుష్టపన్నాగాలు వేసినా చంద్రబాబు అదరలేదు, బెదరలేదు.

పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - ap elections 2024

శపథం చేసి మరీ: మిన్నువిరిగి మీదపడ్డా సత్తువంతా కూడదీసుకుని కొట్లాడగల మొండి గుండె చంద్రబాబుది! అలాంటి చంద్రబాబుతో కంటతడి పెట్టించి క్షుద్ర రాజకీయం చేశారు జగన్‌! ఏనాడూ రాజకీయాల గురించి పట్టించుకోని తన భార్య భువనేశ్వరిని దేవాలయం లాంటి అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేకపోయారు. ఇది కౌరవసభా గౌరవ సభా అంటూ ఆక్రోశించారు. మీకో నమస్కారం అంటూ దండం పెట్టి వెక్కివెక్కి ఏడ్చారు. చంద్రబాబు రాజకీయ భిక్షపెట్టిన వంశీ, కొడాలి నాని వంటి వాళ్లే ఉచ్ఛనీచాలు మరిచి నోరుపారేసుకోవడం చంద్రబాబును తీవ్రంగా బాధించింది. మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు అన్న మాట ప్రకారమే సీఎంగా అడుగుబెట్టబోతున్నారు.

రా కదలి రా అంటూ:జగనాసురుడి వేధింపులు ఎదుర్కొంటూ తెలుగుదేశాన్ని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. మచ్చలేని నాయకుడిగా పేరున్న చంద్రబాబు రాజకీయ జీవితంలో అదే అత్యంత క్లిష్టమైన సమయం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమాలంటూ పసలేని ఆరోపణలు చేసి రాత్రికి రాత్రే చంద్రబాబును అరెస్టు చేశారు. పార్టీకి పెద్దదిక్కు లేకుండా చేయాలని చూశారు. 53 రోజులపాటు జైల్లో నిర్బంధించారు! అది కార్యకర్తల్లో కసి పెంచింది.

నిస్తేజంలో ఉన్న పసుపు సైన్యాన్ని అధినేత కోసం తాడోపేడో తేల్చుకునేంత తెగువ నేర్పింది. బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు కార్యకర్తలు తెల్లవార్లూ నడిరోడ్డపై వేచిచూసి బ్రహ్మరథం పట్టారు! ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వైఎస్సార్సీపీ అరాచకాలపై పోరాటం సాగించారు చంద్రబాబు! "రా కదలి రా" అంటూ 25 పార్లమెంట్‌లలో సభలు నిర్వహించారు. మినీ మేనిఫేస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత దాదాపు 90 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్నికలు జరిగేవరకూ అంటే 4 నెలల్లో 114 నియోజవకర్గాల్ని చుట్టేసి చంద్రయాన్‌లా దూసుకెళ్లారు.

వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు కూడగట్టిన పవనిజం - ఏపీ రాజకీయాల్లో 'పవర్' స్టార్ - game changer in ap politics

రెట్టించిన ఉత్సాహంతో: జగన్ అణచివేసేకొద్దీ గోడకుకొట్టిన బంతిలా బలంగా తెలుగుదేశాన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడిపించారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలను నిరంతరం ప్రజల్లో ఉండేలా చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు కాస్త స్తబ్ధుగా ఉన్న నేతలు, శ్రేణుల్ల్లో జోష్‌ నింపేలా ఒంగోలు మహానాడు నిర్వహించారు చంద్రబాబు! టీడీపీ చరిత్రలో ఎన్నో మహానాడులు, సభలు జరిగినా, జగన్‌ నిర్బంధాలు, ప్రతికూలతల్ని అధిగమించి పసుపుసైన్యం పోటెత్తడం ఒక బౌన్స్‌ బ్యాక్‌గా నిలిచింది. యువతను పార్టీకి బాగా కనెక్ట్ చేసింది.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమనే సంకేతాలను ప్రత్యర్థులకు పంపింది. ఇక పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, ధరల మంటపై బాదుడే బాదుడు అంటూ 19 నియోజకవర్గాల్లో కార్యకర్తల్న కార్యోన్ముఖుల్ని చేశారు. ఆ తర్వాత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకూ 13 జిల్లాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు మార్గాన 10 రోజులపాటు నిర్విరామంగా పర్యటించారు. ప్రాజెక్టుల వారీగా జగన్ విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఎండగట్టి రైతులకు చేసిన అన్యాయాన్ని వివరించారు.

ఏపీలో ఎదురులేని కూటమి - విశ్వరూపం చూపించిన చంద్రబాబు - super hit combo

నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ: చంద్రబాబుకు మాటల్లో కన్నా చేతల్లో సమాధానం చెప్పడం అలవాటు! చంద్రబాబు ముసలాయనంటూ జగన్‌ సహా వైఎస్సార్సీపీ ముఖ‌్యనేతలు హేళన చేశారు. కానీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో 75 ఏళ్లుపైబడిన చంద్రబాబు జోరు చూశాక జగన్‌ 40 ఏళ్ల ముసలాడిలా మిగిలిపోయారు. ఎండ, వానను లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు అవలీలగా ప్రయాణం చేస్తూ ఇతర రాజకీయ పార్టీల నేతలకు భిన్నంగా ప్రచారం సాగించారు చంద్రబాబు!

ఏసీ బస్సులో కూర్చుని అభివాదం చేయడానికీ జగన్‌ ఆపసోపాలు పడితే చంద్రబాబు మాత్రం ఎర్రటి ఎండలోనూ ఓపెన్‌ టాప్‌ వాహనంపై నుంచే అనర్గళంగా ప్రసంగించారు. అంతర్గత సమావేశాలు, కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూనే రోజుకు మూడు నుంచి గరిష్ఠంగా ఐదు సభల్లో పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో తప్ప ఐదేళ్లు ప్రజలతోనే మమేకమయ్యారు. తుపాన్లు వచ్చినా, వరదలొచ్చినా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు! అలా నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశారు.

యువతరంలో ఉరకలెత్తే ఉత్సాహం నింపుతూ: తెలుగుదేశం కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయడంలో తండ్రికి తగ్గ తనయుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్‌ కూడా తన వంతు పాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు తరహాలోనే లోకేశ్‌ పాదయాత్రనూ వైఎస్సార్సీపీ సర్కార్‌ నిర్బంధాలతో ఆదిలోనే అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. కానీ లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. పోలీసులు మైకు లాక్కుంటే, మైకు లేకుండానే మాట్లాడారు. ప్రసంగించే వాహనం సీజ్‌ చేసినా వెనకడుగు వేయలేదు. నడిరోడ్డుపైనే స్టూల్‌పై నిలుచుని మాట్లాడారు. 226 రోజులపాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర నడిచారు. పార్టీ సీనియర్లు, జూనియర్ల మధ్య వారధిలా పనిచేశారు! యువతరంలో ఉరకలెత్తే ఉత్సాహం నింపారు.

పంతం నెగ్గించుకున్న చంద్రబాబు - ఆనందోత్సాహాల్లో టీడీపీ శ్రేణులు - CBN Again CM

పసుపు జెండాను రెపరెపలాడించారు: ప్రజాస్వామిక పద్దతిలోనే రాజకీయం చేయాలనే చంద్రబాబు సంకల్పాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలుసుగా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలతో పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుంంది. ప్రతిపక్ష అభ్యర్థుల్ని నామినేషన్లు కూడా వేయనీయకుండా దుర్మార్గం ప్రదర్శించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే వాతావరణం లేదని గ్రహించిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించారు. నిజానికి పార్టీ ఆవిర్భవించాక, స్థానిక సమరంలో లేకపోవడం అదే తొలిసారి. చంద్రబాబు కాడి కిందపడేశారంటూ వైఎస్సార్సీపీ ముఠా హేళన చేసింది. ఇక తెలుగుదేశం పనైపోయిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడింది.

సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడినట్లుకాదు, అదును చూసి పంజా విసరడానికి అంటూ కార్యకర్తల్లో పట్టుదల పెంచారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తెగువేంటో తెలిసొచ్చేలా చేశారు. ఐదేళ్ల ప్రతిపక్షంలో తెలుగుదేశానికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఒక్క ఎమ్మెల్సీ దక్కటం కూడా కష్టమే అని భావించిన తరుణంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలను, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రజలు నేరుగా ఓటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో ఇక తెలుగుదేశానికి తిరుగులేదని కార్యకర్తలు నేతలకు భరోసా ఇచ్చారు. 2024 ఎన్నికల వరకూ అదే ఒరవడి కొనసాగించి పసుపు జెండాను రెపరెపలాడించారు.

సైకిల్ సునామీలో కొట్టుకుపోయిన ఫ్యాన్ - వెలవెలబోయిన తాడేపల్లి ప్యాలెస్ - YSRCP Central Office in Tadepalli

ABOUT THE AUTHOR

...view details