Chandrababu To Give B Forms To TDP Candidates : సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే తెలుగుదేశం గెలుపు గుర్రాలకు బీఫారమ్ పంపిణీ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఆల్ ది బెస్ట్ తమ్ముళ్లూ అంటూ అధినేత చంద్రబాబు అభ్యర్థులకు చంద్రబాబు తన చేతులమీదుగా బీఫారాలు అందచేశారు. బీఫారమ్ తీసుకున్న ప్రతిఒక్కరూ విజయబావుటా ఎగరవేయాలని స్ఫూర్తి నింపారు. ఇప్పటివరకూ ప్రకటించిన అభ్యర్థుల్లో మొత్తంగా 5గురిని మార్చి వేరొకబరిని సర్దుబాటు చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబునివాసంలో బీఫారమ్‌ల పంపిణీ ప్రక్రియ సందడి వాతావరణంలో సాగింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల్లో పలువురిని మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందించారు.
మెుత్తం ఐదు స్థానాల అభ్యర్థిత్వాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేటుచేసుకున్నాయి. ఉండి టిక్కెట్ రఘురామకృష్ణం రాజుకి కేటాయించారు. ఆ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ అధ్యక్షలుగా నియమించారు. నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతా రామలక్ష్మీని పొలిట్‌బ్యూరోలకి తీసుకోవడంతోపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమన్వకర్తగా నియమించారు. మాడుగుల టిక్కెట్ ను బండారు సత్యనారాయణ మూర్తి దక్కించుకోగా, పాడేరు టిక్కెట్ ను గిడ్డి ఈశ్వరికి అధిష్టానం కేటాయించింది. మడకశిర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎంఎస్ రాజు బరిలోకి దిగనున్నారు. వెంకటగిరి స్థానాన్ని కుమార్తె నుంచి తండ్రి కురుగొండ రామకృష్ణకు మార్చారు.
బీఫారమ్‌ల ప్రక్రియకు మొత్తంగా 13మంది అభ్యర్థులు వివిధ కారణాలవల్ల హాజరుకాలేకపోయారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవింద్‌బాబు, విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దెరామ్మోహన్, చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి, పలమనేరు అభ్యర్థి అమర్నాథ్‌రెడ్డి, బనగానపల్లె అభ్యర్థి బిసిజనార్థన్‌రెడ్డి, తాడిపత్రి అభ్యర్థి జె.సి.ప్రభాకర్‌రెడ్డి, రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవీరెడ్డి లు వివిధ కారణాల చేత హాజరుకాలేకపోయారు.