Chandrababu and Lokesh Republic Day Celebrations: ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి, ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈ వేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.
ఇటువంటి శుభవేళ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి, మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్ర పటాలకు నివాళులర్పించారు. వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
Nara Lokesh at Republic Day Celebrations 2024: హైదరాబాద్‌లోని తన నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాకు వందనం సమర్పించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని లోకేశ్ పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ప్రసాదించింది మన రాజ్యాంగమన్నారు. ప్రజలందరికీ లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు- జెండా ఆవిష్కరించిన గవర్నర్
Republic Day Celebrations at NTR Bhavan: రాజ్యాంగం మంచిగా ఉన్నప్పటికీ పాలించేవాడు దుర్మార్గుడైతే ప్రజలకి నష్టమే జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అయ్యే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కావాలంటే దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితేనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జగన్ రెడ్డి ఎన్నికలయ్యాక పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్దం చేసుకుంటూ మరో వైపు సిద్ధం పేరుతో ప్రచార సభలు నిర్వహించటం హాస్వాస్పదమని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. జగన్ తన ప్రచార సభలకు సిద్ధం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలన్నారు. వైసీపీ సర్కారును పెకలించేందుకు అయిదు కోట్ల మంది ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారని స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గాలు భరించేలేక ఆ పార్టీ నేతల్ని ప్రజలు తన్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన జగన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్రపతి- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్