EX CM Jagan ForeignTour : అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. యూకే వెళ్లే ముందుగా పర్యటన పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ల్యాండ్ లైన్‌తో పాటు మొబైల్ నంబరు, ఈ మెయిల్, ఫ్యాక్స్ వివరాలు కోర్టుతో పాటు సీబీఐకి ఇవ్వాలని న్యాయమూర్తి జగన్‌ను ఆదేశించారు. జగన్‌కు కొత్త పాస్ పోర్టు జారీకి న్యాయస్థానం అంగీకరించింది. జగన్ దరఖాస్తు చేసినట్లయితే అయిదేళ్ల కాల పరిమితితో కొత్త పాస్ పోర్టు ఇవ్వాలని అధికారులను సీబీఐ కోర్టు ఆదేశించింది.
పరిపాటిగా పర్యటనలు : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పర్యటనలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. మొన్నటి వరకు వరుసగా బెంగుళూరు ప్యాలెస్‌కు వెళ్లి వచ్చారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా జగన్ ఇదే సంవత్సరంలో విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు వెళ్లారు. మే 17 నుంచి జూన్1 వరకు ఆయన విదేశాల్లో పర్యటించారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు 2013లో బెయిల్ మంజూరు సందర్భంగా దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించడం తెలిసిందే.