Budameru Repair Works :జోరు వర్షంలోనూ బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు కొనసాగాయి. మంత్రి రామానాయుడు గట్టుపైనే ఉండి పనులు పర్యవేక్షించారు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.
బుడమేరు గండ్లు పూడిక పనులను నాలుగు రోజులుగా రాత్రింబవళ్లు దగ్గరుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుకు రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. ఆమె గండి పూడిక పనులను మంత్రి రామానాయుడుతో కలిసి పరిశీలించారు. బుడమేరు గండ్లు పూడిక పనులను అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసినా ఆపకుండా చేయించామని మంత్రి రామానాయుడు తెలిపారు.
గండ్లు పూడికతో వేలాదిమంది వరద ముంపు బాధితులకు ఉపశమనం కలిగించాలనే వర్షాన్ని సైతం లెక్కచేయలేదని అన్నారు. గండ్లు పూడిక ఏ మేరకు జరిగిందో గంట గంటకు మంత్రి లోకేశ్ డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారని తెలిపారు. డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్న గండ్లు పూడిక పనుల నివేదికను చంద్రబాబుకు లోకేశ్ అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రే అంత కష్టపడుతుంటే మంత్రులం తామెంత కష్టపడాలని రామానాయుడు అన్నారు. సాయంత్రానికి రెండో గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా 3వ గండిని కూడా పూడ్చుతామని మంత్రి రామానాయుడు వెల్లడించారు.