KTR Warning On BRS Party Merge Rumours : భారత రాష్ట్ర సమితిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఘాటుగా స్పందించారు. నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమది అన్న ఆయన, అన్నీ దాటుకొని నిబద్ధత, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్ర భాగాన నిలిపినట్లు పేర్కొన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినట్లు కేటీఆర్ తెలిపారు.
కోట్లాది గొంతుకలు, హృదయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని అన్నారు. ఎప్పటిలానే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, పోరాడుతుందని చెప్పారు. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలు, దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. పడతాం, లేస్తాం తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్, ఏనాటికీ, ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు.