KTR Demands To Take Up SRDP Works :హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టి, 36 పూర్తి చేసిందన్నారు. 2024లో మిగిలినవి పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కొనసాగుతున్న ఎస్ఆర్డీపీ పనులన్నీ మందగించాయని కేటీఆర్ తెలిపారు. గత 8నెలలుగా సరైన పర్యవేక్షణ, చెల్లింపులు లేవని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఎస్ఆర్డీపీలో 3వ దశ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు మూసీ, ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు సహా మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.
అవినీతి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతోంది : అవినీతి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమవుతోందని కేటీఆర్ అన్నారు. ఉపాధ్యాయులు లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15 రోజులుగా మూతపడి ఉన్న పాఠశాలల పరిస్థితిని ఉటంకించారు. అలాగే మహానగరంలోని డిస్పెన్సరీలో మందుల కొరతను ఎత్తిచూపుతూ, ఈనాడు పత్రికలోని కథనాన్ని ట్యాగ్ చేశారు. అవినీతి కాంగ్రెస్ పాలనలో అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ ఆగమవుతోందని, ఆయన ట్వీట్ చేశారు.