KTR Focus On Hydra Musi Issues :హైడ్రా, మూసీ ప్రాజెక్టుల విషయమై తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.
మూసీ పేరిట జరుగుతున్న లూటీని ప్రజల్లోకి తీసుకెళ్తాం :మూసీ పేరిట జరుగుతున్న లూటీని ప్రజల్లోకి తీసుకెళ్తామని, నియోజకవర్గాల వారీగా బస్తీలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి భరోసా కల్పిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ దుందుడుకు చర్యలు, అనాలోచిత విధానాలతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు.
మోదీ పెద్దనోట్ల రద్దు సమయంలో కారణాలు మార్చినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ విషయంలో మాట్లాడుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. దుర్మార్గంగా, అరాచకంగా మూసీ పరివాహకంలో ఉన్న పేదల ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా కూలుస్తామని అంటున్నారని బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేందుకు మాత్రమే హైడ్రా అని మండిపడ్డారు.
పేదలకు రక్షణ కవచంలా ఉంటాం :పేదల కడుపు మీద కొట్టకుండా తాము మూసీ సుందరీకరణ చేశామని, పేదలకు నష్టం కలిగే ప్రతిపాదనలు వద్దని కేసీఆర్ అప్పట్లో వారించారని గుర్తు చేశారు. కూకట్ పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నగర్‌లో 20 వేల మందికి పట్టాలు ఇచ్చి, ఇప్పుడు ఆక్రమణ దారులు అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
"ప్రభుత్వ దుందుడుకు చర్యలపై చర్చించాం. సర్కారు అనాలోచిత విధానాలతో పేదలు ఇబ్బందులు తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్తున్నారు. మూసీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారు. బిల్దర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేందుకే హైడ్రా చర్యలు ఉంటున్నాయి"- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు