BRS Ready to File Disqualification Petition Against Party Changed MLAs :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయంతో ఉన్నారని, అందుకోసమే సొంత ఎజెండాతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలే అంటున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోవడమే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారేమో అని ఎద్దేవా చేశారు. పదవుల్లో ఉన్న వారిని మార్చాలని కాంగ్రెస్‌లోనే ఉద్యమం వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌పై అనర్హతా పిటిషన్ ఇచ్చేందుకు సభాపతి సమయం కోరినట్లు తెలిపారు. సభాపతి పిలుపు కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.
రాహుల్‌ది ఓ విధానం - రేవంత్‌ది మరో విధానం : కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గుర్తు చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చట్టం చేస్తామని ఎన్నిక సమయంలో చెప్పారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు విరుద్ధంగా తెలంగాణలో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. అక్కడ రాహుల్ కాంగ్రెస్ ఒక విధానం, ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ మరో విధానమని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - అధికార పార్టీ పంచన చేరడం అనైతిక చర్యగా నేతల విమర్శ - BRS Fires on Jagtial MLA Sanjay
హైకోర్టులో తేలకుంటే సుప్రీంకు : బీజేపీకి తోకగా తెలంగాణ పీసీసీ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి మోదీ విధానాలను అనుసరిస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ చేస్తున్న ద్రోహమా, కాంగ్రెస్‌లో కొందరు చేస్తున్న ద్రోహమా, ఆ పార్టీ తేల్చుకోవాలని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఎవరినీ వదిలిపెట్టబోమని, చట్టం ప్రకారం అన్ని అవకాశాలు వినియోగించుకొని అనర్హత వేటు పడేలా చూస్తామని తెలిపారు. సభాపతి న్యాయంగా సమయం ఇస్తారని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. అనర్హతా పిటిషన్ల వ్యవహారం 27న హైకోర్టులో విచారణకు వస్తుందని, హైకోర్టు తీర్పు తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగదీశ్ రెడ్డి తెలిపారు.
విచారణ వద్దనడం లేదు కానీ : విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ వద్దని చెప్పడం లేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. కానీ కమిషన్‌లో ఉన్న వారు బీజేపీ, కాంగ్రెస్ నేతల గొంతు వినిపిస్తున్నారని ఆరోపించారు. విచారణ కంటే ముందే తీర్పు చెప్పారన్నారు. కమిషన్ అర్హత కోల్పోయిందని, అందుకే తప్పుకోవాలని కమిషన్‌కు స్పష్టం చేశామన్నారు. విచారణతో వాస్తవాలు అన్నీ తేటతెల్లం అవుతాయని, కేసీఆర్ మల్లెపువ్వులా బయటకు వస్తారని ఆశించామన్నారు. కానీ దురదృష్టవశాత్తు కమిషన్ వేరే ఉద్దేశంతో ఉందని వ్యతిరేకించినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ సూత్రాన్ని పాటిస్తున్నారు : వినోద్ కుమార్ - Former MP Vinod Kumar allegations