BRS Telangana Formation Day Celebrations 2024 :తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరజ్యోతుల ర్యాలీ పేరిట హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న అమరుల స్మృతిచిహ్నం వరకు ర్యాలీ సాగింది. ఉత్సవాల్లో భాగంగా మొదట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు.
అమరులకు అంజలి ఘటించి కొవ్వొత్తులతో కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు సహా ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి రవీంద్రభారతి మీదుగా అమరజ్యోతుల ర్యాలీ సాగించిన నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో పెద్దఎత్తున నడిచారు. ర్యాలీ ముందు వివిధ కళారూపాలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలతో పాల్గొన్నారు.
KCR Wishes to State People : వ్యక్తి గత ద్వేషాలకు తావివ్వకుండా, తెలంగాణ సమాజ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తి అందుకొని ముందుకు సాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలు : స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్న ఆయన, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పించినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు.