BRS Leaders Migration 2024 : హైదరాబాద్ మహానగరంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాలను దక్కించుకునే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా బల్దియాపై గురిపెట్టారు. కార్పొరేటర్ల దగ్గరి నుంచి మేయర్లు, ఎమ్మెల్యేల వరకు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో మొదలైన చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది.
Congress Focus on GHMC : ఇటీవల డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత హస్తం పార్టీలోకి మారగా, తాజాగా మేయర్ విజయలక్ష్మి సైతం పార్టీ మారారు. బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలోకి మారిపోయినందున నగర కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. మేయర్ విజయలక్ష్మి తన పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌లో చేరారని బీఆర్ఎస్ (BRS Leaders Migration) కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి - Lok Sabha Elections 2024
బల్దియాలో పరోక్షంగా పుంజుకున్న కాంగ్రెస్ :2020లో జరిగిన బల్దియా పాలకవర్గ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు గులాబీ పార్టీ కార్పొరేటర్లు హస్తం పార్టీలో చేరికతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 10కి పెరిగింది. భారత్ రాష్ట్ర సమితి బలం 46కు తగ్గింది. తాజాగా మేయర్, డిప్యూటీ మేయర్ల చేరికతో బల్దియాలో కాంగ్రెస్ బలం పరోక్షంగా పుంజుకుంది.
Lok Sabha Elections 2024 :ఎన్నికల (Lok Sabha Polls 2024)సమయానికి మరో 15 మంది కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ నుంచి కొంత మంది కార్పొరేటర్లు చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.