BRS Leader Vinod Kumar on CMs Meeting :రాష్ట్రంలో శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, రేపటి సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.
జమ్మూ, కశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారు కానీ, ఈ విజ్ఞప్తిపై స్పందించలేదని ఆరోపించారు. శాసనమండలిలో కనీసం 40 మంది, అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో మూడో వంతు ఉండాలని, ఆంగ్లో ఇండియన్ కలిపితే రాష్ట్ర శాసనసభలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండేవారని వినోద్ వివరించారు. లోక్ సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని, దీంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119 మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం :ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఇపుడు ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దు అవుతుందని ఆయన చెప్పారు. ఇపుడు మంచి అవకాశం వచ్చిందని, రేపటి సీఎంల సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడి తీసుకొచ్చి రెండు రాష్ట్రాల్లో సీట్లు పెరిగేలా చూడాలని కోరారు.