KTR Comments on Kaleshwaram Project : దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వాన్ని, మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు చూస్తున్నారని మండిపడ్డారు.కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై మరోసారి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాళేశ్వరం తెలంగాణకు ఎందుకు అవసరమో చెప్పారు.
కరవులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ తెర్లైపోతే చుద్దామనుకున్న వంకర వారికి ఈర్ష్య అసూయ పుట్టించి కన్నుకుట్టించిన వరప్రదాయిని ఈ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం అని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమని కేటీఆర్ వివరించారు.
వారి ఏడుపే తమ ఎదుగుదల : శిథిల శివాలయంగా పాడుబడిన శ్రీరామ్ సాగర్‌కు పునరుజ్జీవమిచ్చిన పుణ్యవరంగా కాళేశ్వరాన్ని కేటీఆర్ అభివర్ణించారు. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాంసాగర్‌ను నిండుకుండలా మార్చే అండదండ అని పేర్కొన్నారు. మండుటెండుల్లో కూడా చెరువులకు మత్తళ్లు దూకించిన మహత్యమని తెలిపారు. తమ తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనమే కాళేశ్వరమని అన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క ఆనకట్ట కాదని తెలియని అజ్ఞానం ప్రస్తుత ప్రభుత్వానిదని ఆక్షేపించారు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజమని, సరిదిద్దుకోగలమని చెప్పారు. రాజకీయ కుళ్లు, కుతంత్రాలను, దిష్ఠి చూపులను తట్టుకోగలమన్న కేటీఆర్ 'మీ ఏడుపే మా ఎదుగుదల' అంటూ ట్వీట్ చేశారు.