Harish Rao Fires On Congress in Hyderabad :బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి గ్రూప్స్ అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గ్రూప్-1, 2 మొయిన్స్ పరీక్షకు 1:100 చొప్పున తీయాలని అభ్యర్థులు కోరుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 కావాలని యువతను రెచ్చగొట్టారని, ఇప్పుడు ఎందుకు గ్రూప్స్ మొయిన్స్‌కు ఆ విధంగా చేయడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
Harish Rao on Group 1 and 2 Mains Exams : గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ పోస్టులు పెంచాలని అడిగారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మరి ఇప్పుడు పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని వారు కోరుతున్నారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరినట్లు వివరించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారని, ఎప్పడు ఇస్తారని హరీశ్‌రావు నిలదీశారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నేరవేర్చాలి : మెగా డీఎస్సీ కింద 25,000ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,000ల పోస్టులతో సరిపెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు 25,000ల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఐదింటిని ప్రభుత్వం నెరవేర్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
"వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. మా చేతుల్లో లేదు, ప్రభుత్వాన్ని అడగాలని కమిషన్ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారని తెలిసింది. నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించిన కోదండరాం కూడా బాధ్యత తీసుకోవాలి, గౌరవం కాపాడుకోవాలి. ఒకరిపై ఒకరు చెప్పి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతాం." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి