Jagadish reddy about Congress attack on BRS :రాష్ట్రంలో కింది స్థాయి పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఆదేశాలను పాటిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించి వస్తున్న తమ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీస్‌లు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌పైనా దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వస్తుంటే ఏసీపీ, సీఐ అడ్డుకోలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఏసీపీ, సీఐపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ రాష్ట్ర డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠ దిగజారిపోతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష, ప్రవర్తనే ఈ ఘటనలకు కారణమని విమర్శించారు. సీఎం రేవంత్ వేదికేదో అర్థంకాక సోయిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ నేతలు దాడికి సొంతంగా రాలేదు. పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. లేదా పోలీసులే కాంగ్రెస్ నాయకులను తీసుకొని వచ్చారు. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారు. దీని వల్ల పోలీసు శాఖకు భంగం కలుగుతోంది. ప్రజలకు సైతం పోలీసుల మీద నమ్మకం పోతోంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డీజీపీకి ఉంది. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారణం. పార్టీ శ్రేణులను ఆయన రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలుపై కేసీఆర్ బాధ పడుతున్నారు. ఈ చిల్లర దాడులు మమ్మల్ని భయపెట్టవు. వాస్తవానికి దాడులపై సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలి'-జగదీశ్‌రెడ్డి, మాజీమంత్రి
పార్టీ శ్రేణులను రేవంత్‌రెడ్డి రెచ్చగొడుతున్నారు : పార్టీ శ్రేణులను రేవంత్‌రెడ్డి రెచ్చగొడుతున్నారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. చిల్లర దాడులు తమను భయపట్ట లేవన్నారు. తాము ఉద్యమాల నుంచి వచ్చామని, ఎలాంటి దాడులనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు వివిధ పార్టీల కార్యాలయాలు ఉన్నాయని, ఇతర పార్టీల కార్యాలయాల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కష్టం కేసీఆర్‌దైతే బటన్ నొక్కేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama