KCR Petition In TG High Court : ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధనశాఖ మార్చి 14న జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్ చట్టానికి విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు.
KCR On Power Purchase :విద్యుత్తు కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్తు చట్టంలోని సెక్షన్ 61, 62, 86లకు విరుద్ధమని, దీనిపై రాష్ట్ర సర్కారు అధికారాలు పరిమితమన్నారు. ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్.ఈ.ఆర్.సి పరిధిలోనివేనని స్పష్టం చేశారు.
కమిషన్ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సమగ్ర వివరాలతో లేఖ రాసినా ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. లేఖ రాసిన తరువాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలను సమర్పించాలంటూ కమిషన్ ఈ నెల 19న జారీ చేసిన ప్రొసీడింగ్స్ విచారణ కమిషన్ల చట్టం-1952కు విరుద్ధమని, దీన్ని రద్దు చేయాలని కోరారు. ఇందులో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, విచారణ కమిషన్, వ్యక్తిగత హోదాలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.
అన్ని అనుమతులూ తీసుకున్నాం :విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అన్ని అనుమతులు తీసుకున్నామని కేసీఆర్ పిటిషన్‌లో తెలిపారు. విద్యుత్ చట్టం-2003 కింద ఏర్పాటైన ఎస్.ఈ.ఆర్.సి సమగ్ర విచారణ జరిపి ఉత్తర్వులు జారీచేసే న్యాయవ్యవస్థ అని వీటికి రక్షణ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ట్రైబ్యునల్, కమిషన్, సభ్యులు ఎవరూ ప్రశ్నించడానికి అవకాశం లేదన్నారు. ఈఆర్సీ పరిధిలోని అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అది నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించవచ్చన్నారు.
ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అన్ని అంశాలనూ ఎస్ఈఆర్సీ పరిధిలోనే విచారణ చేయాలని వీటిపై మరెక్కడా విచారణ చేపట్టరాదంటూ గుజరాత్ ఊర్జా వికాస్ వర్సెస్ ఏఆర్ పవర్ లిమిటెడ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తుచేశారు.