Ex CM KCR Election Campaign in Narsapur :రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారమెక్కిన కాంగ్రెస్ పార్టీ, కేవలం ఐదు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. వరి నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు, కోత కోసిన తర్వాత ఇస్తుందని నిట్టూర్చారు. దీనికంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు, నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్న గులాబీ బాస్, మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవీ అమలు చేయలేదని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయ్యిందా? కరెంట్ సరిగా వస్తుందా? అని సభావేదికగా ప్రజలను ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయిందని, ఇప్పుడెందుకు కరెంట్ కోతలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు.
"బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మంజీరా నది, హల్దీ వాగులపై ఎన్నో చెక్ డ్యామ్‌లను కట్టించాను. దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. అదంతా ఇప్పుడు దెబ్బతీసే పరిస్థితి వస్తోంది. అంటే తాగు నీరు రావు. సాగు నీళ్లు రావు. కరెంట్ రాదు. పేదల సంక్షేమం లేదు. నాడు వృద్ధులకు రూ.2 వేలు పెన్షన్ ఇచ్చుకున్నాం, దాన్ని కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. మరి వచ్చాయా? అవి వచ్చే నమ్మకం ఉన్నదా? ఏ ఒక్క హామీ నెరవేర్చలే, ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్పటం అలవాటుచేసుకుంది."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత