Botsa Satyanarayana Party Meetings in GVMC Building :ఎన్నికల నియమావళి అమల్లో ఉందని అధికార యంత్రాంగం మర్చిపోయిందో, లేక మంత్రి బొత్స సత్యనారాయణ కోరారని సాగిలపడ్డారో తెలీదు కానీ, విశాఖ బీచ్ రోడ్డులోని జీవీఎంసీ భవనాన్ని వైసీపీ కార్యకలాపాలకు అప్పగించారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే వైసీపీ కోడ్ ఉల్లంఘిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీ పోటీ చేస్తున్నారు. జీవీఎంసీ భవనంలోనే వైసీపీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ గెస్ట్‌హౌస్‌కు ఝాన్సీ, బొత్స సత్యనారాయణ వచ్చి వెళుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సైతం ఓ సమావేశం నిర్వహించగా తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న కార్లతోపాటు, ఏపీలోని పలు జిల్లాల నుంచి వచ్చిన కొన్ని కార్లు గెస్ట్‌హౌస్ బయట నిలిపి ఉన్నాయి. మూడు కార్లకు సిద్ధం స్టిక్కర్లు సైతం ఉన్నాయి. ఎస్కార్ట్ వాహనం, పోలీసు స్టిక్కరుతో ఉన్న కారు సైతం ఆ ప్రాంతలంలో నిలిపి ఉంది. కారు డ్రైవర్లను ప్రశ్నించగా, లోపల వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం జరుగుతుందని వెల్లడించాడు.
చంద్రబాబు దిల్లీ పర్యటనపై అప్పుడు స్పందిస్తా - మంత్రి బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గతంలో ఆ ప్రాంతంలో జీవీఎంసీకి పాత గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్ కూల్చేసి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ (జీవీఎస్‌సీసీఎల్) నిధులతో కొత్త భవనం నిర్మించారు. జీవీఎస్‌ఎస్‌సీఎల్ ఎస్‌ఈతో మాట్లాడగా, ఆ భవనాన్ని జీవీఎంసీకి అప్పగించేశామని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కమిషనరే బొత్సకు ఆ భవనం కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి, ఒక ప్రభుత్వ భవనాన్ని వైసీపీ రాజకీయ సమావేశాలకు ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.