MP Raghunandan Rao about Minister Konda Surekha Trolls :బీఆర్ఎస్ సోషల్ మీడియాకు తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఇవాళ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొండా సురేఖ తొలిసారి దుబ్బాకకు కల్యాణ్ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చినందుకు ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేసినట్లు చెప్పారు. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా వేశానని గుర్తు చేశారు.
అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని రఘునందన్ రావు అన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. పోస్టు పెట్టిన అకౌంట్‌కు హరీశ్‌రావు, కేసీఆర్ ఫోటో ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదని విమర్శించారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్లు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండని డిమాండ్ చేశారు. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఉదేశిస్తూ అన్నారు.
'గతంలో ప్రధాని నరేంద్రమోదీకి కూడా నూలు పోగు దండ వేశాను. అలానే ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశాను. కానీ కొందరు అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉన్న ఫొటో, హరీశ్‌రావు, కేటీఆర్ ఫొటోలున్న అకౌంట్ నుంచి ఈ పోస్టులు పెట్టారు. వెంటనే కేటీఆర్, హరీశ్‌రావు స్పందించి చర్యలు తీసుకోవాలి'-రఘునందన్ రావు, బీజేపీ మెదక్ ఎంపీ