BJP MP Laxman Comments on BRS and Congress :బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు జీర్ణించుకోలేక తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని బడా బాబులకు అప్పగించిందని, ప్రస్తుత సర్కార్ దానిపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
దేవాలయ భూముల కోసం బీజేపీ ఉద్యమం చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. రైతు రుణమాఫీపై ఇప్పటి వరకు ఎందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఎంఎంటీఎస్(MMTS) రెండో ఫేస్‌ను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం, గిరిజన వర్సిటీ, రైల్వేలు, జాతీయ రహదారుల కోసం మోదీ ప్రభుత్వం రూ.వేల కోట్లు నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు.
BJP MP Laxman on Vijay Sankalp Yatra :ఈరోజు వరకు విజయ సంకల్ప యాత్ర 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి అయిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. దేశం కోసం మోదీ(Modi), మోదీ కోసం తాము అని ప్రజలు అంటున్నారని చెప్పారు. దివ్యమైన రామాలయం కట్టిన మోదీని తాము ఎలా కాదంటామని ప్రజలు అంటున్నారన్నారు. మోదీ ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగిందని సర్పంచ్‌లు సైతం చెప్పారన్నారు. ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.