BJP Arvind Election Campaign in Nizamabad :కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారని, లోక్‌సభ ఎన్నికలు కాగానే ప్రభుత్వం కూలిపోతుందని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అర్వింద్ జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని ధ్వజమెత్తారు. గత ఐదు సంవత్సరాల్లో తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని, తనకంటే ముందుగా ఎంపీగా ఉన్న కవిత జైళ్లో ఉన్నారని తెలిపారు.
అవినీతి చేయాల్సి వస్తే రాజకీయాలు వదిలేస్తాను తప్ప తప్పు చేయనని అర్వింద్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ పసుపు బోర్డును తీసుకువచ్చానన్న ఆయన రాష్ట్రం ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ ఏడాదిలోపు తెరుచుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున ప్రజలకు కావాల్సిన పనులు కావడం లేదని విమర్శించారు. అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించారని కోరారు.
"ఉత్తమ్, కోమటిరెడ్డి అనుకుంటే ప్రభుత్వం ఠక్కున పడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారు. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఎన్నికలు కాగానే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పడిపోతుంది. గుజరాత్ మోడల్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పారు. గుజరాత్ మోడల్‌కు రేవంత్ రెడ్డి సహకరిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. కేంద్ర పథకాలు అమలు చేయకపోవడం రాష్ట్రానికి నష్టం. కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలకు తీరని నష్టం. వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని నేను కోరుకోవట్లేదు. ప్రజలకు నష్టం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది." - అర్వింద్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి