BJP 8 Seats Won In Telangana Loksabha Elections 2024 : 2014లో ఒక ఎంపీ స్థానం! 2018లో నాలుగు ఎంపీ స్థానాలు! ప్రస్తుత లోక్‌సభ పోరులో బీజేపీ సాధించిన ఎంపీ స్థానాలు 8! ఈ లెక్కలు తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ ప్రభావానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణనే అధికారంలోకి వచ్చేందుకు తమ లక్ష్యంగా ఎంచుకున్న కమలనాథులు, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలుచుకున్న కాషాయదళం, ఇటీవలి అసెంబ్లీ పోరులో 8 సీట్లతో తన పట్టును మరింత పెంచుకుంది. ప్రస్తుత లోక్‌సభ సమరంలోనూ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐదు నెలల పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. జనంలో దాదాపు రెండు నెలలు ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లో పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, జాతీయ నాయకులను రాష్ట్రానికి వివిధ సభలు, సమావేశాలకు రప్పించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అగ్ర నేతలతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీల అమలుపై వైఫల్యం, పదేళ్ల బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో బీజేపీ హవా : ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు. మూడు సార్లు రాష్ట్రానికి వచ్చి ఐదు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ తరువాత మూడుసార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్పై ఎదురు దాడి చేస్తూనే పదేళ్ల నరేంద్ర మోదీ పాలన, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు.