BJLP Leader Eleti Comments on Congress Assurance : రైతు భరోసాకు చట్టబద్దత కల్పించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు జరగకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తామన్నారని ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు.
రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ కసరత్తు ప్రారంభించలేదని మండిపడ్డారు. పేదల భూములను ధరణి పోర్టల్ పేరుతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ పేరు చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, భూముల లెక్కలను ప్రభుత్వం తేల్చిందా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో జరిగిన రెండు లక్షల రూపాయల కుంభకోణం బయటకు తీయాలన్నారు.
"అవకతవకల, అక్రమాల ధరణి పోర్టల్ ఏమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూమాత తెస్తామన్నారు. ఇంకా దాని ప్రశస్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో, భూ హక్కులు కోల్పోయినటువంటి రైతులందరికీ న్యాయం చేస్తామన్న విషయంపై స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్ పాలనలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. మరి వాటిపై విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వంగా సిద్ధంగా ఉందా?" -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత
సమగ్ర భూసర్వే ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేయాలి : తెలంగాణ ఏర్పడిన తర్వాత 40 శాతం దేవాదాయ వక్ఫ్ బోర్డు భూములను గత ప్రభుత్వం మింగిందని, ఆ కుంభకోణాలపై ప్రస్తుత ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ప్రతి 30 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన సమగ్ర భూసర్వే జరగలేదన్న మహేశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేయాలన్నారు.