Balka Suman Fires On CM Revanth : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న అక్కసుతో సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దళితులపట్ల ఉన్న చిన్నచూపునకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు.
Balka Suman Comments On Modi :ఈ విషయంపై సీఎం తక్షణమే క్షమాపణలు చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలపైనా స్పందించారు. మోదీ సహకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Election) రేవంత్ గెలిచారన్న ఆయన ఇప్పుడు లోక్సభలో మోదీకి సీఎం సాయం చేస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే లోక్సభ ఎన్నికల(Lok Sabha Polls) బరిలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారని వ్యాఖ్యానించారు. మోదీ పదేళ్ల(Modi Govt) పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీలేదన్న బాల్క సుమన్ మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు.
కేసీఆర్ను వేధించేందుకే కవితను అరెస్టు చేయించారు :దక్షిణాదిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ మోదీని ప్రశ్నిస్తున్న కేసీఆర్ను వేధించేందుకే, కవితపై కేసులు పెట్టి బీజేపీ అరెస్టులు చేయించిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. మోదీతో జోడీ కట్టకపోతే ఈడీ, సీబీఐలు వస్తాయని గతంలో కర్ణాటక మొదలు అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయని బాల్క అన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న వారిని ఎంపీగా ఏపీలో బీజేపీ నిలబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్గా రూ.కోట్లు ఇచ్చిన శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని మండిపడ్డారు.