Balineni on YS Jagan Property Disputes :వైఎస్సార్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఆస్తుల విషయంలో వైఎస్సార్ పేరు చెడగొట్టి రోడ్డుపైకి వచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌రెడ్డి పరువు బజారు కీడుస్తున్నారని ఆవేద వెలిబుచ్చారు. ఆడపడచు కన్నీళ్లు ఆ ఇంటికే అరిష్టమని జగన్ గుర్తించాలని హితవు పలికారు. ఇప్పటికైనా పరిష్కారం చేసేందుకు విజయమ్మ ముందుకురావాలని కోరారు. ఇందులో విజయమ్మ తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నట్లు బాలినేని చెప్పారు.
Sharmila vs YS Jagan : ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎఎస్సార్సీపీలో తాను ఏమీ సంపాదించుకోలేదని ఉన్నవి కూడా పోగొట్టుకున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.