Pawan Sensational Comments on Telugu Movies :ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్ కోరారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సమావేశం - Pawan Kalyan Meet Karnataka CM
పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని పవన్ తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ-కర్ణాటక మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయన్నారు. కర్ణాటక - ఏపీ సరిహద్దులో ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక సహకారం ఇస్తామందని గుర్తుచేశారు. ఎనిమిది కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక ఒప్పుకోవడం సంతోషమన్నారు.